తొలి టీ20లో భారత్ విజయం

వన్డే సిరీస్‌ ఎలాగూ పోయింది. కనీసం పొట్టి ఫార్మాట్‌లోనైనా మెరుపు బ్యాటింగ్‌తో అదరగొడదామని భావించిన ఆస్ట్రేలియాకు భంగపాటే ఎదురైంది. ఇటీవలి కాలంలో టీమిండియాకు తమ విశేష ప్రతిభతో వరుస విజయాలను అందిస్తున్న బౌలర్లు రాంచీ మ్యాచ్‌లోనూ మెరిశారు. వీరి ధాటికి అసలు బ్యాటింగ్‌ ఎలా చేయాలో తెలీదన్నట్టుగా ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు క్యూ కట్టారు.

అటు పేసర్లు.. ఇటు స్పిన్నర్లు తమ అద్భుత బంతులతో చేసిన మూకుమ్మడి దాడికి వార్నర్‌ బృందంలో ఏకంగా ఆరుగురు బ్యాట్స్‌మెన్‌ క్లీన్‌ బౌల్డ్‌ కావడం విశేషం. ఆ తర్వాత డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం 6 ఓవర్లలో 48 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ మరో మూడు బంతులుండగానే మ్యాచ్‌ను ముగించింది. టి20ల్లో ఆసీస్‌పై భారత్‌కు వరుసగా ఇది ఏడో విజయం కావడం విశేషం.

బౌలర్లు సమష్టిగా రాణించడంతో ఆస్ట్రేలియాతో టి20 సిరీస్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. శనివారం జరిగిన తొలి టి20లో భారత్‌ తొమ్మిది వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో మూడు టి20ల సిరీస్‌లో కోహ్లి సేన 1–0 ఆధిక్యం సాధించింది. ఇరు జట్ల మధ్య రెండో టి20 మంగళవారం గువాహటిలో జరుగుతుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ ఇన్నింగ్స్‌కు చివర్లో వర్షం అంతరాయం కలిగించింది.దీంతో ఆ జట్టు 18.4 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 118 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ ముగించాల్సి వచ్చింది. ఆరోన్‌ ఫించ్‌ (30 బంతుల్లో 42; 4 ఫోర్లు, 1 సిక్స్‌) మినహా ఎవరూ రాణించలేదు. ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోరును దాటగలిగారు. కుల్దీప్, బుమ్రాలకు రెండేసి వికెట్లు దక్కాయి. భువనేశ్వర్, హార్దిక్‌ పాండ్యా, యజువేంద్ర చహల్‌ తలా ఓ వికెట్‌ తీశారు.

Related posts:

loading...