ఆకరి వన్డేలో భారత్ విజయం.. మనమే నెంబర్ వన్


భారత్‌ మళ్లీ పంజా విసిరింది. పరాజయాన్ని ఒక్క మ్యాచ్‌కే పరిమితం చేస్తూ తమదైన శైలిలో మరోసారి చెలరేగింది. గత మ్యాచ్‌ ఓటమికి తగిన రీతిలో జవాబిస్తూ సత్తా చాటడంతో సిరీస్‌లో మరో వన్డే మన ఖాతాలో చేరింది. సొంతగడ్డపై తిరుగులేని ప్రదర్శనతో చెలరేగిన టీమిండియా ముందు నిలవలేక ప్రత్యర్థి ఆస్ట్రేలియా పూర్తిగా చేతులెత్తేసింది. భారీ విజయంతో సిరీస్‌ను ముగించిన కోహ్లి సేన నంబర్‌వన్‌ స్థానాన్ని సుస్థిరపర్చుకుంది. ఇక తదుపరి లక్ష్యం టి20 సిరీస్‌. రోహిత్‌ శర్మ మెరుపు సెంచరీ, రహానే కళాత్మక ఇన్నింగ్స్‌ 243 పరుగుల లక్ష్యాన్ని భారత్‌కు సునాయాసంగా మార్చేశాయి. ఈ ‘సియట్‌’ జోడి పిచ్‌పై వేగంగా దూసుకుపోయి వరుసగా మూడో మ్యాచ్‌లో శతక భాగస్వామ్యం నెలకొల్పింది. అంతకుముందు శుభారంభం చేసి కూడా భారత స్పిన్‌ ద్వయం దెబ్బకు ఆస్ట్రేలియా కుదేలైంది. ఆసీస్‌పై వరుసగా మూడు సిరీస్‌లలో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన రోహిత్, 6 వేల పరుగుల మైలురాయితో మ్యాచ్‌ను చిరస్మరణీయం చేసుకున్నాడు.

ఇప్పటికే సిరీస్‌ చేజిక్కింది. మామూలుగా అయితే మిగతా మ్యాచ్‌ల్లో ఎలాంటి ఫలితం వచ్చినా పర్వాలేదు. కానీ ఐదు వన్డేల సిరీస్‌లో 3-1 ఆధిక్యంతో ఉన్న భారత్‌కు చివరి వన్డే ఎంతో కీలకం. ఈ మ్యాచ్‌లో ఓడితే.. నంబర్‌వన్‌ ర్యాంకుచేజారిపోయే ప్రమాదం వుంది. సిరీస్‌ విజయం సాధించడంతో దక్కిన నంబర్‌వన్‌.. నాలుగో వన్డే ఓటమితో తాత్కాలికంగా భారత్‌ చేజారిన సంగతి తెలిసిందే.

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ను భారత్‌ అద్భుత రీతిలో ముగించింది. ఐదు వన్డేల సిరీస్‌ను 4–1తో గెలుచుకుంది. ఆదివారం జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్‌ 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. గత మ్యాచ్‌లో బెంగళూరులో ఓటమి మినహా… చెన్నై, కోల్‌కతా, ఇండోర్‌లలో కూడా భారత్‌ నెగ్గింది. ఐదో వన్డేలో టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. డేవిడ్‌ వార్నర్‌ (62 బంతుల్లో 53; 5 ఫోర్లు) అర్ధ సెంచరీ చేయగా… స్టొయినిస్‌ (63 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్‌), ట్రావిస్‌ హెడ్‌ (59 బంతుల్లో 42; 4 ఫోర్లు) రాణించారు. అక్షర్‌ పటేల్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్‌ 42.5 ఓవర్లలో 3 వికెట్లకు 243 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రోహిత్‌ శర్మ (109 బంతుల్లో 125; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) వన్డేల్లో 14వ సెంచరీ సాధించాడు. అజింక్య రహానే (74 బంతుల్లో 61; 7 ఫోర్లు) ఈ సిరీస్‌లో వరుసగా నాలుగో అర్ధ సెంచరీ చేయగా, విరాట్‌ కోహ్లి (55 బంతుల్లో 39; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసిన హార్దిక్‌ పాండ్యాకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఈ నెల 7న రాంచీలో తొలి మ్యాచ్‌ జరుగుతుంది.

Related posts:

loading...